: సల్మాన్ చెల్లికి కోపం వచ్చింది...ఇన్‌స్ట్రాగ్రాంలో మండిపడింది
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక విషయం మీడియాలో నానుతూ వుంటుంది. తొలుత సల్మాన్ హిట్ అండ్ రన్ కేసు, జింకల వేట వ్యవహారాలు మీడియాలో హల్ చల్ చేయగా, అది ముగిసిన తరువాత సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా ఖాన్ వివాహ బంధం బీటలు వారడం... ఆ తరువాత సల్మాన్ పెళ్లి వ్యవహారం, తాజాగా సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ వ్యక్తిగత జీవితంపై పలు కధానాలు బాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. తన బిడ్డ పెంపకం గురించి కూడా మీడియాలో వార్తలు రావడంతో అర్పితా ఖాన్ కు చిర్రెత్తుకొచ్చింది. దీనిపై తన ఇన్ స్టాగ్రాంలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ పనీ లేని వాళ్లు, అభద్రతా భావంతో ఇబ్బంది పడేవారు, అసూయపరులు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఆమె సూచించింది. ఇలాంటి వారు చేసే వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇస్తే అదో పెద్ద ఇష్యూ అవుతుందని ఆమె తెలిపింది. తన ఫోటోలు, కుటుంబం, భర్త, బరువు, ముఖం, రంగు, లైఫ్ స్టైల్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోవద్దని తన సన్నిహితులకు సూచించింది. 'నా కుమారుడిని ఎలా చూసుకుంటున్నానన్న విషయం వారికెందుకు?' అని ప్రశ్నించింది. ఇలా వేరే వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే వారిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని, ఇలా సమయాన్ని వేస్టు చేసుకునే కంటే సద్వినియోగం చేసుకోవాలని ఆమె హితవు పలికింది. తమ గురించి కుక్కల్లా మొరగడం మాని ఎవరి పని వారు చూసుకుంటే బాగుంటుందని అర్పితా ఖాన్ శర్మ సూచించింది.