: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేకాలం ఇక లేనట్టే!


ఇకపై ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే కాలం లేనట్టేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవలి ధరల సవరణ తరువాత ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 63.02కు, డీజిల్ ధర రూ. 51.67కు చేరిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2014 తరువాత 'పెట్రో' ఉత్పత్తుల ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఇక భవిష్యత్తులో ఈ ధర మరింతగా పెరుగుతుందని, బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ ఏడు నెలల తరువాత 50 డాలర్లను దాటిన క్రమంలో తిరిగి దిగివచ్చే అవకాశాలు లేవని చమురు రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో కనిష్ఠ స్థాయులను చూసిన క్రూడాయిల్ ధరలు, అంతర్జాతీయ అంశాలు, ఒపెక్ ఉత్పత్తిని తగ్గించడం వంటి కారణాలతో తిరిగి పైకి రావడం ప్రారంభమైందని ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గోల్డ్ మన్ సాక్స్ గుర్తు చేసింది. ఇదే సమయంలో పెట్రోలు, డీజిల్ లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుండటం, ఉత్పత్తి తగ్గడంతో ధరలు దిగివచ్చే చాన్స్ లేదని తెలిపింది. "1920 లేదా 1930 నాటి స్థాయికి క్రూడాయిల్ ధరలు దిగజారుతాయని గతంలో అంచనాలు వేశాం. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు" అని ప్లాట్స్ ఎకానమిస్ట్ మ్రిగంకా జైపూరియర్ వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం జనవరిలో బ్యారల్ కు 30 డాలర్ల వరకూ దిగజారిన క్రూడాయిల్ ధర ఇప్పుడు రికవరీ దిశగా దూసుకొచ్చి 50 డాలర్లను దాటిందని గుర్తు చేశారు. డాలర్ తో పోలిస్తే రూపాయి మరింతగా బలహీనమవుతూ ఉండటం దేశవాళీ చమురు కంపెనీలపై ఒత్తిడిని పెంచుతోందని రేటింగ్స్ సంస్థ 'కేర్' పేర్కొంది. ఈ సంవత్సరం ముగిసేలోగా బ్యారల్ ముడిచమురు ధర 68 నుంచి 69 డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తూ, కేంద్ర ప్రభుత్వం స్పందించి సబ్సిడీని పెంచకుంటే, లీటరు పెట్రోలు ధర నాలుగైదు నెలల్లోనే రూ. 80 దాటుతుందని తెలిపింది. కాగా, 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత మోదీ సర్కారు, క్రమంగా పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను పెంచుకుంటూ వెళ్లిన సంగతి తెలిసిందే. అందువల్లే ముడి చమురు ధర 30 డాలర్లకు చేరినా, ఆ ప్రయోజనం ప్రజలకు దగ్గర కాలేదు. ఇక ఇప్పుడు ధరలు పెరుగుతున్న వేళ, సుంకాలను తగ్గించకుంటే, వాహనదారులు ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News