: ఇవేం ఏర్పాట్లు?... మహానాడు ఏర్పాట్లపై నారా లోకేశ్ ఫైర్!
ఏపీలో అధికార పార్టీ టీడీపీ ఏటా నిర్వహించుకునే వార్షిక పండుగ ‘మహానాడు’ మరికొద్ది గంటల్లో మొదలు కానుంది. రేపు ఉదయం తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభం కానున్న ఈ వేడుకలకు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో పాలుపంచుకునేందుకు నిన్న రాత్రికే చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెకు చేరుకున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొద్దిసేపటి క్రితం తిరుపతికి చేరుకున్నారు. నేరుగా మహానాడు వేదిక వద్దకు చేరుకున్న ఆయన ఆక్కడ జరిగిన ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇవేం ఏర్పాట్లు? ఇలాగైతే ఈ వేడుకను సంతోషంగా ముగిస్తామా? వెంటనే మార్పులు చేయండి. సాయంత్రంలోగా పటిష్ట ఏర్పాట్లు పూర్తి కావాలి’’ అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పార్టీ నేతలు అయోమయంలో పడ్డారు. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే చివరి నిమిషంలో లోకేశ్ వచ్చి ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. లోకేశ్ చెప్పిన మేరకు ఏర్పాట్లలో మార్పులు చేర్పులు చేసేందుకు వారు చర్యలు చేపట్టారు.