: భారత్‌లో ప్రతీ 8 నిమిషాలకి ఓ చిన్నారి అదృశ్యం.. భయం పుట్టిస్తోన్న గణాంకాలు
భారత్‌లో ప్రతీ 8 నిమిషాలకి ఓ చిన్నారి అదృశ్యమవుతున్నాడు. ప్రతీ ఏడాది లక్ష మంది చిన్నారులు తప్పిపోతున్నారు. వారిలో 45శాతం మంది చిన్నారులు తిరిగి తమ ఇంటికి చేరుకోలేపోతున్నారు. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ మిస్సింగ్ డే సందర్భంగా నిన్న ఓ సంస్థ ఈ విషయాలని వెల్లడించింది. దీని ప్రకారం అపహరణ, అదృశ్యానికి గురవుతోన్న చిన్నారుల్లో తిరిగి ఇంటికి చేరుకోలేకపోతున్న వారి శాతం 2013తో పోల్చితే 2015లో 84శాతం పెరిగింది. సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 2011, 2014 మధ్య అదృశ్యమైపోయిన చిన్నారుల సంఖ్య 3.25 లక్షలుగా ఉంది. వారిలో బాలికల సంఖ్య రెండు లక్షలుగా ఉంది. అపహరణకు గురయిన చిన్నారులను నేర సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనేట్లు చేస్తున్నారు, కొందరు చిన్నారులు బాల కార్మికులుగా పనిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, అసోం, ఒడిశా, బీహార్, హర్యానా రాష్ట్రాల్లో అదృశ్యమవుతోన్న వారిలో మైనర్ బాలికలే అధికంగా ఉన్నారు. జాతీయ నేర నమోదు సంస్థ 2014 సంవత్సర గణాంకాల ప్రకారం దీంట్లో పశ్చిమబెంగాల్ లో అపహరణకు గురవుతోన్న చిన్నారుల్లో మైనర్ బాలికల శాతం 42గా ఉంది.