: టీఆర్ఎస్ఎల్పీలో కొడాలి నాని, జోగి రమేశ్!... తుమ్మలకు గ్రీటింగ్స్ చెప్పిన వైసీపీ ఎమ్మెల్యేలు!


హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో కొద్దిసేపటి క్రితం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన శాసనసభాపక్ష కార్యాలయం (టీఆర్ఎస్ఎల్పీ)లో ఏపీలో విపక్ష పార్టీ వైసీపీ చెందిన ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(కొడాలి నాని), జోగి రమేశ్ లు ప్రత్యక్షమయ్యారు. అప్పటికే అక్కడికి చేరుకున్న తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన వారిద్దరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరిన తుమ్మలకు తెలంగాణ సీఎం కేసీఆర్ తొలుత ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. మంత్రి పదవీ ఇచ్చారు. ఆ తర్వాత మొన్న ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో తుమ్మలను పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించిన కేసీఆర్... బంపర్ మెజారిటీతో గెలిపించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తుమ్మల ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు కొద్దిసేపటి క్రితం అసెంబ్లీకి చేరుకున్నారు. ఇదే సమయంలో రాజ్యసభకు వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అసెంబ్లీకి వచ్చారు. సాయిరెడ్డితో పాటు అసెంబ్లీకి వచ్చిన కొడాలి నాని, జోగి రమేశ్ లు.. నేరుగా టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వెళ్లి తుమ్మలకు గ్రీటింగ్స్ చెప్పారు. ఈ సన్నివేశాన్ని అక్కడి వారు ఆసక్తిగా తిలకించారు.

  • Loading...

More Telugu News