: ఎమ్మెల్యేలను కొంటున్నారు.. ఆపై వారిని నట్టేట ముంచుతున్నారు: వైఎస్ జగన్

అధికార తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కొంటున్నారని, ఆపై వారిని నట్టేట ముంచుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్యసభ అభ్యర్థిగా విజయ సాయిరెడ్డి పేరును ప్రకటించిన అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు 'మనుషుల మధ్య సంబంధాలను' డబ్బుతో బేరమాడుతున్నారని జగన్ ఆరోపించారు. ఎన్నో కుట్రలు చేస్తున్నారని అన్నారు. తమ ఎమ్మెల్యేలను కొని, అనంతరం వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా నేతలను ముంచేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో విశ్వసనీయులకు సరైన స్థానం కల్పిస్తామని, అందుకే విజయసాయిరెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.