: చేయాల్సిందే చేస్తున్నాం: వాల్ స్ట్రీట్ జర్నల్ తో ప్రధాని నరేంద్ర మోదీ
ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేస్తున్నామని, సంస్కరణల అమలును వేగవంతం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మోదీ సర్కారు బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, వాల్ స్ట్రీట్ జర్నల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, ఇండియాలో ఎన్డీయే సర్కారు చేయాల్సిందే చేస్తోందని అన్నారు. తన ముందు ఎంతో లక్ష్యం ఉందని, అది సుదూరంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డ ఆయన, అత్యధిక సంస్కరణలను ఇప్పటికే అమలు చేస్తున్నామని తెలిపారు. విదేశీ పెట్టుబడుల విషయంలో మరింత సరళీకృత విధానాన్ని తీసుకువస్తామని, అవినీతిని పూర్తిగా రూపుమాపేందుకు మరిన్ని చర్యలు అవసరమని అన్నారు. గ్రామీణ భారతావనిలో మౌలిక వసతుల కొరతను అధిగమించాల్సి వుందని నరేంద్ర మోదీ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. కీలకమైన గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అమలైతే, ఇండియాలో వ్యాపారం మరింత సులువవుతుందని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు అమలవుతుందన్న నమ్మకముందని తెలిపారు. కాగా, వచ్చే నెల ఆరంభంలో నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సభలో మోదీ ప్రసంగించనున్నారు.