: మళ్లీ మారిన రైలు టికెట్ల రద్దు పాలసీ... వెయిటింగ్, ఆర్ఏసీ ఉన్నా వర్తింపు
మరింత సులభంగా రైలు టికెట్లను రద్దు చేసుకునేలా మరోసారి క్యాన్సిల్ పాలసీని మారుస్తూ ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు కీలక నిర్ణయం తీసుకున్నారు. వెయిటింగ్ లిస్టులో ఉన్నా, ఆర్ఏసీ (రిజర్వేషన్ ఎగనెస్ట్ క్యాన్సిలేషన్) లో టికెట్ ఉన్నా ఫోన్ కాల్ లేదా ఆన్ లైన్ ద్వారా ఇకపై టికెట్లను రద్దు చేసుకోవచ్చు. ఇకపై రైల్వే స్టేషన్ లోని టికెట్ కౌంటరులో టికెట్ కొనుగోలు చేసినప్పటికీ, ఫోన్ ద్వారా కూడా తమ టికెట్ ను రద్దు చేసుకోవచ్చు. 139 నంబరుకు ఫోన్ చేసి లేదా ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా రద్దు చేసుకోవచ్చు. అయితే, ఇప్పటివరకూ రైలు బయలుదేరడానికి కనీసం నాలుగు గంటల ముందు వరకూ మాత్రమే ఈ టికెట్లను రద్దు చేసుకునే సదుపాయం ఉండగా, ఇప్పుడు దాన్ని రైలు కదిలే అరగంట ముందు వరకూ పొడిగించారు. ఇక టికెట్ రద్దు తరువాత, రైల్వే రిజర్వేషన్ కౌంటరుకు వెళ్లాల్సి వుంటుంది. టికెట్ తీసుకున్న సమయంలో నమోదు చేయించుకున్న సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా రద్దు ప్రక్రియ పూర్తయి, నిబంధనల మేరకు డబ్బు చేతికందుతుంది.