: ఉద్యోగులదే ఆలస్యం!... అమరావతిలో వసతి సిద్ధం!: హైదరాబాదులో కరపత్రం చక్కర్లు!


వచ్చే నెల 27 నాటికి ఏపీ సచివాలయ ఉద్యోగులు హైదరాబాదును వీడి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి తరలిరావాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగులు కూడా మానసికంగా సిద్ధమవుతున్నారు. ఓ వైపు ఇక అమరావతి పరిధిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం శరవేగంగా సాగుతుండగా, మరోవైపు ఉద్యోగులకు అవసరమైన వసతి సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. సచివాలయాన్ని ప్రభుత్వం నిర్మిస్తుండగా, వసతి సౌకర్యాల కల్పన మాత్రం ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ మేరకు నిన్న హైదరాబాదులోని సచివాలయంలో ఏపీ ఉద్యోగులు పనిచేస్తున్న బ్లాకుల్లో ఓ కరపత్రం ప్రత్యక్షమైంది. ‘‘మీదే ఆలస్యం.. వసతి సౌకర్యాలన్నీ సిద్ధం’’ అంటూ చెబుతూ ప్రత్యక్షమైన సదరు కరపత్రం వైపు ఉద్యోగులు ఆసక్తి కనబరిచారు. సదరు కరపత్రంలో ఉన్న వివరాల్లోకి వెళితే... విధి నిర్వహణ నిమిత్తం ఉన్నపళంగా హైదరాబాదు నుంచి అమరావతికి తరలివస్తున్న ఉద్యోగులకు కావాల్సిన వసతి సౌకర్యాలను ప్రైవేట్ నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. అమరావతి పరిధిలోని గ్రామాలు... ప్రత్యేకించి తాత్కాలిక సచివాలయం సమీపంలోని మందడం తదితర గ్రామాల్లో రైతులు, బిల్డర్లు, స్థానిక వ్యాపారులు వసతి సౌకర్యాలను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు అపార్ట్ మెంట్లు సిద్ధమైపోయాయి. సదరు అపార్ట్ మెంట్లలో హాస్టళ్లు వెలిశాయి. కేవలం వసతి మాత్రమే కావాలా? లేదంటే వసతితో పాటు భోజన సౌకర్యం కూడా కావాలా?... ఛాయిస్ ఉద్యోగులదేనట. ఓ తరహా వసతి కావాలన్నా అందించేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. వారంలో ఐదు రోజుల పనిదినాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో వారంలో ఐదు రోజుల వసతికి కూడా అక్కడ ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఏసీ వసతి కావాలా? నాన్ ఏసీ వసతి కావాలా? అంటూ కూడా ఆ కరపత్రం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇద్దరు, ముగ్గురు కలిసి ఉంటారా?, నలుగురైదుగురు ఉంటారా? అన్నది ఉద్యోగుల ఇష్టమేనట. అయితే ఏ తరహా వసతికి సంబంధించి అదే తరహాలో ఫీజు ఉంటుందంటూ... చెల్లించాల్సిన డబ్బుకు సంబంధించి కూడా కరపత్రంలో స్పష్టమైన వివరాలున్నాయి. ఈ కరపత్రం పట్ల ఉద్యోగులు ఆసక్తి కనబరుస్తున్నారు.

  • Loading...

More Telugu News