: మహానాడు వేదిక పైకప్పుకు అంటుకున్న మంటలు!
టీడీపీ ఏటా నిర్వహించే వేడుక ‘మహానాడు’కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుమల వెంకన్న పాదాల చెంత తిరుపతిలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలు రేపు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నగరంలోని మునిసిపల్ గ్రౌండ్ లో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే నిన్న ఓ చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతుండగా... పార్టీ సీనియర్లు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో ప్రధాన వేదిక పైకప్పుపై మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు చూస్తుండగానే మరింత విస్తరించాయి. వేడుకలు ప్రారంభం కావడానికి ముందే ఈ తరహా ఘటన చోటుచేసుకోవడంతో ఒకింత షాక్ కు గురైన టీడీపీ నేతలకు ఏమీ పాలుపోలేదు. అయితే ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఆ మంటలు వాటంతట అవే ఆరిపోయాయి. దీంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.