: సత్తా చాటిన సన్ రైజర్స్!... కోల్ కతాను ఎలిమినేట్ చేసిన హైదరాబాద్!
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు సత్తా చాటింది. ఇప్పటికే లీగ్ దశ ముగిసిన మెగా టోర్నీలో ప్లే ఆఫ్ కు చేరుకున్న హైదరాబాదు జట్టు నిన్న రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో పటిష్ట జట్టుగా పేరున్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును చిత్తుగా ఓడించింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాదు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ (44)తో పాటు హెన్రిక్స్ (31), డేవిడ్ వార్నర్ (28) రాణించారు. ఆ తర్వాత 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నైట్ రైడర్స్ తడబడింది. నిర్ణీత 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 8 వికెట్లు చేజార్చుకుని 140 పరుగులు మాత్రమే చేసింది. దీంతో హైదరాబాదు జట్టు 22 పరుగుల తేడాతో నైట్ రైడర్స్ పై విజయం సాధించింది. సిరీస్ ప్రారంభంలో సత్తా చాటిన హైదరాబాదు జట్టు ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఇక ఫైనల్ బెర్తు కోసం గుజరాత్ లయన్స్ జట్టుతో రేపు కీలక పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లోనూ విజయం సాధిస్తే... ఇప్పటికే ఫైనల్ చేరిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుతో తలపడాల్సి ఉంది.