: బిగ్ బీ అమితాబే వ్యాఖ్యాతగా ఎందుకు..? బీజేపీ సభ నేపథ్యంలో కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 28న బీజేపీ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద భారీ సభను నిర్వహించనన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో వ్యాఖ్యాతగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ని బీజేపీ నియమించింది. అయితే, ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలను ఎక్కుపెట్టింది. పనామా పత్రాల్లో అమితాబ్ బచ్చన్ పేరుందని, అవినీతి అంతం చేస్తానన్న ప్రధాని మోదీ పనామా పత్రాల్లో పేరున్న వ్యక్తిని వ్యాఖ్యాతగా ఎలా నియమించారని కాంగ్రెస్ సూటిగా ప్రశ్నిస్తోంది. నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామని, నల్లధనం కూడబెడుతోన్న వారికి శిక్ష విధిస్తామని మోదీ హామీ ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత రన్‌దీప్ సుర్జీవాలా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘ఇప్పుడు మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న వ్యక్తిని బీజేపీ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా వ్యాఖ్యాతగా పెట్టుకోవడం ఎటువంటి సందేశాన్నిస్తుంది?’ అని ఆయన ప్రశ్నించారు. అమితాబ్ బచ్చన్ ను ఓ నటుడిగా, పెద్దమనిషిగా భారత ప్రజలు అభిమానిస్తారని, ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజం కాకపోవచ్చని, నిర్దోషిగా బయటపడొచ్చని రన్‌దీప్ సుర్జీవాలా అన్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అమితాబ్ ను బీజేపీ వ్యాఖ్యాతగా తీసుకుంటే మాత్రం ఈ అంశం తప్పుడు సందేశాన్నే ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.