: బతకాలంటే అదే దారి... బతుకుతామన్న ఆశలేదు.. మొండి ధైర్యంతో ల్యాండ్ చేశాం!: ఎయిర్ అంబులెన్స్ పైలట్
అవి చివరి క్షణాలు...బతుకుతామో లేదో తెలియని భయంతో బతకాలనే ధైర్యంతో తీసుకున్న నిర్ణయం ఇప్పుడిలా మాట్లాడే అవకాశం కల్పించిందని ఢిల్లీ శివార్లలో ల్యాండ్ చేసిన ఎయిర్ అంబులెన్స్ పైలట్ తెలిపారు. పక్షవాతంతో బాధపడుతున్న ఓ రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్ విమానం ఇంజిన్లు ఫెయిల్ అవడంతో ఢిల్లీ సమీపంలోని పొలాల్లో అత్యవసరంగా దింపేసిన ఘటనపై ఆయన మాట్లాడుతూ, అది పీడకలలాంటి అనుభవమని అన్నారు. ఢిల్లీకి 40- 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఎడమ ఇంజిన్ ఫెయిల్ అయిందని ఆయన చెప్పారు. ల్యాండింగ్ కి కొన్ని నిమిషాల ముందు కుడి ఇంజిన్ కూడా ఫెయిల్ అయిందని ఆయన వెల్లడించారు. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదని. రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడంతో విమానం కూలిపోయేవరకు ఆగలేక...అత్యవసర ల్యాండింగ్ చేశామని ఆయన తెలిపారు. అయితే సురక్షితంగా ల్యాండ్ అవుతామని భావించలేదని, ఏదో మొండి ధైర్యంతో ల్యాండ్ చేశామని ఆయన చెప్పారు. ఇళ్లు, విద్యుత్ స్తంభాలు లేని ఓ పొలాన్ని చూసుకుని విమానాన్ని ల్యాండ్ చేశామని ఆయన చెప్పారు. ఇంధనం లేకపోవడం వల్ల ఇంజిన్లు ఫెయిల్ అయ్యాయన్న వార్తలను ఆయన ఖండించారు. విమానంలో ప్రయాణానికి సరపడా ఇంధనం ఉందని ఆయన తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో విమాన సిబ్బంది, డాక్టర్, రోగి సహా ఏడుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రోగిని గుర్గావ్ లోని ఆసుపత్రికి తరలించగా, ఘటనపై పౌర విమానయానశాఖ విచారణ ప్రారంభించింది. కాగా, నజాఫ్ గడ్ లోని విమానం ల్యాండైన పొలాలు జాతరను తలపిస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ విమానం చూసేందుకు తండోపతండాలుగా జనం వస్తున్నారు.