: ఐపీఎల్ లోకి పాక్ క్రికెటర్లను కూడా అనుమతించాలి: ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్
ఐపీఎల్ లోకి పాకిస్థాన్ ఆటగాళ్లను కూడా అనుమతించాలని బీసీసీఐను తాను కోరనున్నట్లు ఐసీసీ అధ్యక్షుడు, పాక్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ తెలిపారు. బీసీసీఐ కొత్త అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఆహ్వానం మేరకు బెంగళూరులో ఆదివారం జరగనున్న ఐపీఎల్-9 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఆయన రానున్నారు. ఈ సందర్భంగా కరాచీలో మీడియాతో జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ, పాకిస్థాన్ ఆటగాళ్లను ఐపీఎల్ లోకి అనుమతిస్తే లీగ్ ప్రాధాన్యం మరింత పెరుగుతుందని బీసీసీఐకు వివరించే ప్రయత్నం చేస్తానన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ కు సంబంధించిన చర్చలకు ఇదో మంచి వేదిక అవుతుందని తాను భావిస్తున్నట్లు అబ్బాస్ తెలిపారు. కాగా, ఐపీఎల్ తొలి సీజన్ లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఆడారు. అయితే, ముంబయి దాడుల జరిగిన తర్వాత ఐపీఎల్ కి పాక్ క్రీడాకారులను తీసుకునేందుకు బీసీసీఐ అనుమతించడం లేదు.