: ఇద్దరూ సీఎంలే అయినా చెరో రకం నీతా?: కేంద్రంపై శైలజానాథ్ విసుర్లు
వాళ్లిద్దరూ సీఎంలే అయినప్పటికీ వారిపై చెరో రకం నీతి చూపించడం సబబుగా లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి స్టింగ్ ఆపరేషన్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఒక నీతి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు మరో నీతా? అని ఆయన ప్రశ్నించారు. ‘ఓటుకు నోటు’ కేసులో చంద్రబాబుపై సాక్ష్యాలన్నీ వీడియో టేపుల్లో ఉన్నాయని, సీబీఐతో విచారణ జరిపేందుకు ఇంతకంటే ఇంకేమి సాక్ష్యం కావాలని అన్నారు. విచారణల పేరిట కాంగ్రెస్ పార్టీ సీఎంలపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని శైలజానాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత గండ్ర రమణారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ సీఎంలకు ఒకనీతి, సీఎం చంద్రబాబుకు మరో నీతా? అని ప్రశ్నించారు.