: మీరొక కీలు బొమ్మ, మిమ్మల్ని కొందరు వ్యక్తులు ఆడిస్తున్నారు: ముద్రగడపై గంటా ఆగ్రహం
కాపులకు నిర్మించనున్న భవనాలకు చంద్రన్న అనే పేరు పెట్టొద్దంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ లేఖ రాయడం పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ముందు ఎన్నో సవాళ్లున్నా కాపు రిజర్వేషన్ల కోసం మంజునాథ కమిటీని వేశామని ఆయన అన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా కాపులకు రిజర్వేషన్ల అంశం పరిశీలిస్తున్నామని తెలిపారు. ముద్రగడ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడే భాష అభ్యంతరకరంగా ఉందని అన్నారు. కాపు నేతలు మిగతా వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని సూచించారు. గత ఎన్నికల్లో టీడీపీకి కాపుల ఓట్లు భారీగా పడ్డాయని, వారి రుణం తీర్చుకుంటామని గంటా అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని గంటా చెప్పారు. సున్నితమైన సమస్యకు శాస్త్రీయ పద్ధతిలో పరిష్కారం కనుగొంటున్నామని అన్నారు. అయితే రాజకీయ ఉనికిని కోల్పోకుండా ఉండాలనే ముద్రగడ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘మీరొక కీలు బొమ్మ.. మిమ్మల్ని కొందరు వ్యక్తులు ఆడిస్తున్నారు’ అని గంటా ముద్రగడని విమర్శించారు. ‘కాపులకు నష్టం కలిగించేలా ముద్రగడ ఇటువంటి లెటర్లు రాయకూడదు’ అని అన్నారు. చంద్రన్న పేరుపెడుతున్నారంటూ విమర్శిస్తున్నారని, తమ నాయకుడు చంద్రబాబు ఇంతవరకూ ఏ పథకాలకు తన పేరు పెట్టుకోలేదని గంటా అన్నారు. తన పేరు పథకాలకు పెట్టొద్దని చంద్రబాబు నాయుడు పలుసార్లు చెప్పారని ఆయన అన్నారు. ‘కాపు జాతికి మీరే ప్రతినిధిగా మాట్లాడకండి’ అని ముద్రగడని విమర్శించారు. ‘కాపుల పట్ల ప్రభుత్వం సుముఖంగా ఉంది. దయ చేసి ఎవరో రాసిచ్చిన లేఖలను మాకు పంపొద్దని కోరుతున్నా’నని ఆయన వ్యాఖ్యానించారు.