: మట్టి ముంత, నీళ్లతో జూన్ 2న ప్రదర్శనలు, ఆగస్టు 9న సామూహిక నిరసన దినం: చలసాని శ్రీనివాస్
కేంద్ర వైఖరికి నిరసనగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన మట్టి ముంత, నీళ్లతో జూన్ 2న నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ తెలిపారు. ‘బీజేపీ ఆంధ్రప్రదేశ్ పై చెబుతోన్న మాటలు వింటుంటే మా కడుపుమండి పోతోంద’ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలోని అన్ని వర్సిటీల్లో హోదాపై సమావేశాలు నిర్వహిస్తామని చలసాని చెప్పారు. హోదా కోసం పోరాటంలో జైలుకి వెళ్లేందుకైనా సిద్ధమని ఉద్ఘాటించారు. ఆగస్టు 9న సామూహిక నిరసన దినం నిర్వహిస్తామని తెలిపారు. మోదీ ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆయన అన్నారు. ఏపీని మోసం చేసిన బీజేపీ నేతలను జైలుకి పంపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మాణిక్యాలరావు ప్రత్యేక హోదాను వరకట్నంతో పోల్చడం సరికాదని చలసాని అన్నారు.