: వయసు పెరిగేకొద్దీ స్నేహాలు పలచబడతాయట!


ఓ మంచి స్నేహితుడు ఉంటే చాలు, జీవితం హాయిగా గడిచిపోతుందని అంటారు. స్నేహానికన్న మిన్న లోకాన ఏదీ లేదురా? అని ఓ సినీ కవి ఏ ముహూర్తాన చెప్పాడో కానీ కుటుంబం కంటే స్నేహితులే గొప్ప అంటూ గొప్పగా చెప్పుకునేవారు ఎందరో ఉన్నారు. దీంతో అసలు స్నేహాల పరిస్థితి ఏంటి? అనేదానిపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అయితే ఇప్పుడు స్నేహాలను ఎలా లెక్కించాలో తెలియని దుస్థితి నెలకొంది. మనిషి పరిపక్వత సాధించేకొద్దీ స్నేహాలు పల్చబడిపోతాయని ఈ సర్వే వెల్లడించింది. 25 ఏళ్ల వరకూ చదువుకునే సమయంలో స్నేహితుల సంఖ్యను పెంచుకుంటూ వస్తే, విద్యాభ్యాసం పూర్తయిన తరువాత వారితో బంధం బలహీనపడుతుందని ఈ సర్వే తెలిపింది. సోషల్ మీడియాను మినహాయించి, ఫోన్ ద్వారా ఎంత మంది స్నేహితులతో మాట్లాడుతున్నారనే దానిపై ఆరాతీయగా, ఓ 25 ఏళ్ల యువకుడు నెలకు 19 మందితో మాట్లాడుతున్నాడని తేలగా, అదే సమయంలో ఓ యువతి 17 మంది స్నేహితులతో మాట్లాడుతోంది. ఇలా స్నేహితులతో టచ్ లో ఉండడం 39 ఏళ్లకు వచ్చే సరికి పురుషుడు 12 మందితో టచ్ లో ఉంటే, స్త్రీలు 15 మందితో స్నేహంగా మసలుకుంటున్నారట. అవే స్నేహాలు 80 ఏళ్లు వచ్చేసరికి స్త్రీ, పురుషులిద్దరూ నెలకు ఆరుగురితో మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో నకిలీ స్నేహాలపై మోజుతో నిజమైన స్నేహమాధుర్యాన్ని కోల్పోతున్నారని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్నేహాలు సక్రమంగా ఉండకపోవడానికి కారణం వ్యాపారం, ఉద్యోగం, కుటుంబ పరిస్థితులు అని అంతా చెప్పడం విశేషం.

  • Loading...

More Telugu News