: ఫ్లిప్ కార్ట్ ను చూసి ఇతర అవకాశాలు వదులుకున్న టెక్కీలు... తీవ్రంగా స్పందిస్తూ లేఖ రాసిన అహ్మదాబాద్ ఐఐఎం
గొప్పలకు పోయి క్యాంపస్ రిక్రూట్ మెంట్లలో భారీ మొత్తాలను ఆఫర్ చేసి టెక్కీలకు ఆశపెట్టి, ఆపై పునర్వ్యవస్థీకరణ, ఆటోమేషన్ అంటూ, జాయినింగ్ డేట్ ను ఇవ్వకుండా కాలం గడుపుతున్న ఫ్లిప్ కార్ట్ పై అహ్మదాబాద్ ఐఐఎం అధికారులు తీవ్రంగా స్పందించారు. తొలుత జూన్ లో విధుల్లోకి చేరచ్చని చెబుతూ, ఆపై దాన్ని డిసెంబరుకు మార్చిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిన్నీ బన్సాల్ కు లేఖ రాస్తూ, తమ విద్యార్థులకు ఉద్యోగ గ్యారెంటీ ఇవ్వాలని, జాయినింగ్ తేదీని వెంటనే స్పష్టం చేయాలని అధికారులు డిమాండ్ చేశారు. ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగం పొందుతున్నామన్న ఆనందంలో విద్యార్థులు మరో సంస్థలో ఉద్యోగ ప్రయత్నం చేయలేదని గుర్తు చేసింది. ఉద్యోగం వద్దనుకునే వారికి రూ. 1.50 లక్షల నష్ట పరిహారం ఇస్తామని ఫ్లిప్ కార్ట్ చేసిన ప్రతిపాదననూ తిరస్కరించారు. ఈ మేరకు ప్లేస్ మెంట్ కమిటీ చైర్ పర్సన్ ఆశా కౌల్ లేఖను రాస్తూ, తమతో కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడాలని, ఉద్యోగులు వద్దనుకుంటే, సంప్రదింపులతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ ఈ-మెయిల్ కాపీని సంస్థ చీఫ్ పీపుల్ ఆఫీసర్ నితిన్ సేథ్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సచిన్ బన్సాల్ లకు కూడా పంపారు. ఇండియాలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా ఉన్న ఫ్లిప్ కార్ట్ ఈ తరహాలో ఉద్యోగులను మోసం చేస్తుందని భావించలేదని ఆమె ఆశా కౌల్ అన్నారు.