: మోదీతో హ్యాపీగా ఉందన్న మూడింట రెండొంతుల మంది!
నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండటంతో ఎన్డీయే పాలన సంతృప్తికరంగా ఉందని మూడింట రెండు వంతుల మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 'లోకల్ సర్కిల్స్' అనే సంస్థ దేశవ్యాప్తంగా 15 వేల మందిని భాగం చేస్తూ, ఓ సర్వే నిర్వహించి, వారికి 20 ప్రశ్నలు సంధించి, జవాబులను రాబట్టింది. ఈ సర్వే ప్రకారం, 64 శాతం మంది పౌరులు, తమ అంచనాలకు అనుగుణంగా పాలన సాగుతోందని, 36 శాతం మంది అంచనాలకు తగ్గట్టు పాలన లేదని వెల్లడించారు. కీలక రంగాల్లో మరింతగా చేయాల్సి వుందని, ముఖ్యంగా మహిళలు, చిన్నారుల రక్షణకు, ధరల పెరుగుదలను ఆపేందుకు చర్యలు తీసుకోవాల్సి వుందని అత్యధికులు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, సబ్సిడీని డైరెక్టుగా ఖాతాలోకి జమ చేయడం వంటి అంశాలతో ఇండియాలో తమ కుటుంబ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని భావిస్తున్నట్టు 76 శాతం మంది వెల్లడించినట్టు సర్వే నివేదిక పేర్కొంది. కేంద్రం జీఎస్టీని ఎలాగైనా అమలు చేసి తీరుతుందని 61 శాతం, ఆ నమ్మకం లేదని 30 శాతం మంది తెలుపగా, మౌలిక వసతుల విషయంలో అభివృద్ధి కళ్లకు కనిపిస్తోందని 72 శాతం మంది వెల్లడించారు. గత నెలలో సుమారు 20 సార్లు ఈ పోల్ జరుగగా, ఒక్కో పోల్ లో 15 వేల మంది పాల్గొన్నారు. మొత్తానికి వారి నుంచి 3,75,568 సమాధానాలను తీసుకుని వాటిని క్రోడీకరించినట్టు లోకల్ సర్కిల్స్ వెల్లడించింది. నిరుద్యోగ సమస్య తగ్గిందని 35 శాతం మంది, నేరాలు తగ్గాయని 38 శాతం మంది, ప్రజల సలహాలను ప్రభుత్వం స్వీకరిస్తోందని 36 శాతం మంది, అవినీతి తగ్గిందని 61 శాతం మంది, ఉగ్రవాదం పెరిగిందని 21 శాతం మంది అభిప్రాయపడ్డారు.