: సొంత పొలాన్ని అమ్మి ఊరికి డ్యామ్ నిర్మిస్తున్న మహోన్నత రైతు!


దశాబ్దం క్రితం వచ్చిన 'ఇంద్ర' సినిమా కథ తెలుసుగా? తన ఊరి వద్ద డ్యామ్ నిర్మించి నీటిని నిల్వ చేసేందుకు ఆస్తులన్నీ వదిలేసుకున్న వ్యక్తి కథతో చిరంజీవి నటించగా, సూపర్ హిట్టయిన సినిమా అది. ఇప్పుడు మహారాష్ట్రలో ఆ కథ నిజమైంది. తన ఊరికి నీరందించేందుకు డ్యామ్ కట్టాలని భావించి ఎకరాలకు ఎకరాలు అమ్మేసుకున్న మహోన్నత రైతు నిజజీవిత గాధ ఇది. మరిన్ని వివరాల్లోకి వెళితే, మహారాష్ట్రలోని అలోలా జిల్లాలోని మూర్తిజాపూర్ తాలూకా, సాంగ్వీ దుర్గ్ వాడా గ్రామానికి చెందిన రైతు సంజయ్ తిడ్కే. గ్రామానికి సమీపంలో 3 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యముండే డ్యామ్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించిన మహారాష్ట్ర సర్కారు, ఒక్క రూపాయి కూడా నిధులను కేటాయించలేదు. సమీపంలోనే కాలువ వెళుతుంటే, దానికి అడ్డుకట్ట వేసి నీటిని వాడుకోలేకపోతున్నామన్న బాధ ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరికీ ఉండేది. సమస్యను తీర్చాలనుకున్న సంజయ్, తనకున్న 30 ఎకరాల భూమిలో 10 ఎకరాలను రూ. 55 లక్షలకు విక్రయించి ఆనకట్ట నిర్మాణానికి పూనుకున్నారు. "నీరు లేకుంటే భూములన్నీ ఎండిపోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వానికి ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో నేనే ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే కెనాల్ పై డ్యామ్ నిర్మించాలని ఆలోచించి, పనులు ప్రారంభించాం. ఇకపై మా పొలాల్లో సోయా, పత్తి పంటలు పండనున్నాయి" అని సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం స్పందించకున్నా స్థానిక అధికారులు మాత్రం సంజయ్ కి సహకరించారు. డ్యామ్ ఎలా నిర్మించాలన్న విషయమై ప్లాన్ చెప్పారు. అయితే, ఉన్నతాధికారుల నుంచి మాత్రం వేధింపులు తప్పడం లేదట. ఏదిఏమైనా, మరో రెండు వారాల్లో డ్యామ్ నిర్మాణం పూర్తవుతుందని, నీటి నిర్వహణ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రకటిస్తున్నా, నిధులను మాత్రం విడుదల చేయడం లేదని సంజయ్ ఆరోపించారు. డ్యామ్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడల్లా, గ్రామంలోని రైతులు తనకు అండగా నిలిచేవారని, ఈ డ్యామ్ తో ఊరంతా బాగుపడుతుందని సంబరంగా చెబుతున్నారు.

  • Loading...

More Telugu News