: కంప్యూటర్ యుగంలోనూ తగ్గని మూఢనమ్మకాలు.. మంత్రాల నెపంతో వ్యక్తిని కొట్టి చంపిన వైనం
కంప్యూటర్ యుగంలోనూ పాతకాలపు మూఢనమ్మకాలు ఏ మాత్రం తగ్గలేదు. చేతబడి, బాణామతి అంటూ నేటి కాలపు మనుషులు కూడా తమ మతి తప్పినట్లు ప్రవర్తిస్తున్నారు. జన విజ్ఞాన వేదిక వంటి ఎన్నో సంస్థలు ప్రజల్లో మూఢ నమ్మకాల భయాలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నా.. వాటినుంచి బయటపడని ప్రజలు ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే నిజామాబాద్ జిల్లా ఖానాపూర్ గ్రామంలో జరిగింది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో గోవిందాపురం నర్సయ్య(65) అనే వ్యక్తిని చెట్టుకి కట్టేసి చితకబాదారు. అనంతరం నర్సయ్య స్పృహ కోల్పోవడంతో దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. నర్సయ్య మంత్రాలు చేస్తుండడంతో తమ కుటుంబ సభ్యులు వ్యాధులకి గురవుతున్నారని మల్లయ్య అనే అనే వ్యక్తి ఆరోపించాడని, దీంతో పలువురు ఈ దారుణానికి పాల్పడ్డారని సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.