: వేలానికి సహారా ఆస్తులు!... 61 ఆస్తులకు రూ.6,500 కోట్లు వచ్చే అవకాశం
స్వల్పకాలంలో అధిక వడ్డీలతో రెట్టింపు లాభాలను ఇస్తామంటూ జనం నుంచి వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించి ఆపై మోసానికి పాల్పడిన సహారా పరివార్ ఆస్తుల వేలానికి రంగం సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెక్యూరిటీస్ ఎక్చెంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) సహారా ఆస్తులను ఈ-వేలం వేసేందుకు సిద్ధమైంది. ఏపీ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సహారాకు ఉన్న 61 ఆస్తులను గుర్తించిన సెబీ... వాటి వేలం బాధ్యతను హెచ్ డీఎఫ్ సీ రియాలిటీ, ఎస్బీఐ కేపిటల్ మార్కెట్స్ కు అప్పగించింది. హెచ్ డీఎఫ్ సీ రియాలిటీకి అప్పగించిన 31 ఆస్తుల వేలం ద్వారా రూ.2,400 కోట్లు వచ్చే అవకాశాలున్నట్లు సెబీ అంచనా వేస్తోంది. ఇక ఎస్బీఐ కేపిటల్ మార్కెట్స్ కు అప్పగించిన 30 ఆస్తుల వేలం ద్వారా 4,100 కోట్లు రానున్నట్లు సమాచారం. వెరసి మొత్తం 61 సహారా ఆస్తులను వేలం వేయడం ద్వారా రూ.6,500 కోట్లు వస్తాయని సెబీ అంచనా వేస్తోంది. ఇప్పటికే వేలం ప్రక్రియను ప్రారంభించిన ఆ రెండు సంస్థలు ఆయా ఆస్తుల వేలానికి సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటించనున్నాయి.