: తండోపతండాలుగా వచ్చిన జనాలతో తిరునాళ్లుగా మారిన విమానం కూలిన ప్రాంతం!


సాంకేతిక లోపంతో ఢిల్లీకి సమీపంలోని పంట పొలాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విమానం ఉన్న ప్రాంతం ఇప్పుడో పెద్ద తిరునాళ్లుగా మారిపోయింది. విమానాన్ని దగ్గరి నుంచి చూసేందుకు, దాని ముందు సెల్ఫీలు దిగేందుకు యువత ఉత్సాహం చూపుతుండగా, ఆ ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారాలు ఎన్నో వెలిశాయి. విమానం దిగిన గంట వ్యవధిలోనే, ఐస్ క్రీం షాపులు, జ్యూస్ షాపులు వచ్చేశాయి. ఇక సాయంత్రానికి వేలాది సంఖ్యలో ప్రజలు ఆ ప్రాంతానికి తండోపతండాలుగా తరలి రావడంతో వ్యాపారం సైతం జోరుగా సాగింది. "నా జీవితంలో ఇటువంటి సన్నివేశాన్ని నేను చూడలేదు. అందుకే ఓ పిక్చర్ తీసుకున్నా. దీన్ని అందరికీ చూపిస్తా. సోషల్ మీడియాలో ఆప్ లోడ్ చేస్తా. ఇలాంటి అవకాశం అందరికీ రాదు" అని తన నలుగురు స్నేహితులతో కలిసి విమానాన్ని దగ్గరి నుంచి చూసేందుకు వచ్చిన ఆదిల్ తెలిపాడు. "చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజల్లో అత్యధికులు ఇక్కడికి వచ్చారు. దీంతో మా వ్యాపారం కోసం అటూ ఇటూ తిరగాల్సిన అవసరం రాలేదు. పిల్లలతో కలిసి తల్లిదండ్రులు వస్తుండటంతో వ్యాపారం బాగా సాగింది. సాయంత్రానికే రూ. 500కు పైగా సంపాదించాను" అని ఐస్ క్రీం వ్యాపారి మనోహర్ కాలే వివరించాడు. విమానం దిగడాన్ని తాను చూడలేదని, అయితే, ప్రజలంతా ఇటువైపు వస్తుండటంతో ఏదో పెద్ద విషయమే జరిగి ఉంటుందని అనుకున్నానని తెలిపాడు. సాయంత్రానికి అన్ని ఐస్ క్రీంలూ అమ్మేసి ఇంటికి వెళ్లానని చెప్పాడు. కాగా, విమానానికి కాపలా కోసం, ప్రజలను అదుపు చేసే నిమిత్తం 20 మంది ఇన్ స్పెక్టర్లతో కూడిన పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు డీసీపీ సురేందర్ కుమార్ తెలిపారు. డీజీసీఏ నుంచి ప్రత్యేక బృందం వచ్చి విమానాన్ని పరిశీలించిన తరువాత దీన్ని తొలగించే విషయమై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News