: ఐపీఎల్ లో నేడు 'డూ ఆర్ డై' పోరు: డేవిడ్ వార్నర్ టీమ్ కోల్ కతాను ఇంటికి పంపిస్తుందా..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో నిన్న జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓటమి ఖాయమనుకున్న బెంగళూరు జట్టు అనూహ్యంగా గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆ టీమ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఫైనల్‌లోకి ప్రవేశించాలంటే గుజరాత్ లయన్స్ కి మరో ఛాన్స్ ఉంది. నేడు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా ఈరోజు మరో ఉత్కంఠ రేపే మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌లు డూ ఆర్ డై పోరులో తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో మొదటి మ్యాచుల్లో ఓడి, తరువాత చెలరేగి పోయి ఆడి, మళ్లీ ఓటములను మూటగట్టుకున్న హైదరాబాద్ టీమ్ కోల్‌కతాతో పోరాడి నిలబడగలుతుందా..? అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. మంచి ఫామ్‌తో మెరుగైన ఆటతీరును కనబరుస్తోన్న హైదరాబాద్ టీమ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పైన అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈరోజు జరిగే మ్యాచ్‌లో వార్నర్ టీమ్ గెలిస్తే గుజరాత్‌తో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఓడితే ఇక ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది. కోల్‌కతా టీమ్ ఐపీఎల్ లో పాయింట్ల పట్టికలో 16 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలవగా, హైదరాబాద్ టీమ్ కూడా అదే పాయింట్లతో మెరుగైన రన్ రేట్ సాధించి మూడోస్థానంలో నిలిచింది. మరోవైపు, ఇప్పటికే రెండుసార్లు కప్పుకొట్టుకుపోయిన కోల్‌కతా టీమ్ ఈసారి ముచ్చటగా మూడోసారీ దాన్ని తన్నుకుపోవాలనే పట్టుదలతో ఉంది. రైడర్స్ జట్టులో కెప్టెన్ గంభీర్, ఊతప్ప, పఠాన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఏది ఏమయినా సమ ఉజ్జీలుగా కనపడుతోన్న ఇరు జట్ల మధ్య నేడు జరిగే ఆసక్తికర మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠతో వేచి చూస్తున్నారు. ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.