: పేటెంట్ వచ్చేసింది... హోండా నుంచి రానున్న ఏసీ బైకులు!


ఇక ఎండాకాలంలోనూ బైకుపై కూర్చుని చల్లగా దూసుకెళ్లే రోజులు ఎంతోదూరంలో లేవని చెప్పొచ్చేమో. జపాన్ కేంద్రంగా పనిచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ద్విచక్రవాహనాలను విక్రయిస్తూ, ఇండియాలో రెండో అతిపెద్ద టూ వీలర్ సంస్థగా ఉన్న హోండా వినూత్న ఏసీ బైక్ లను తయారు చేసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బైకులకు ఏసీ యూనిట్ ను అమర్చే విధానంపై పేటెంట్ ను పొందిన సంస్థ, దీనికి తుది రూపాన్ని ఇచ్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. కాగా, పేటెంట్ కోసం చేసిన దరఖాస్తులో వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏసీ యూనిట్, ఓ చిన్న లగేజ్ బ్యాగ్ అంత ఉంటుంది. ఓ చిన్న బ్లోయర్ యూనిట్, రీచార్జబుల్ బ్యాటరీ ఇందులో ఉంటాయి. ఇందులో నుంచి గాలి వేగంగా బయటకు వచ్చి సరాసరి శరీరాన్ని, మెడను తాకుతూ, హెల్మెట్ లోపలి నుంచి ముఖానికి అందుతుంది. ఇది చాలా సింపుల్ గా ఉన్న ఎయిర్ కండిషనింగ్ విధానమని నిపుణులు వ్యాఖ్యానించారు. మరింత చల్లదనం కోసం ఇందులో ఐస్ క్యూబులు వేసుకునే సదుపాయం కూడా ఉంది. అయితే, 100 కిలోమీటర్లకు మించిన వేగంతో వెళ్లేటప్పుడు ఏసీ యూనిట్ పనితీరుపై కొన్ని అనుమానాలు వస్తున్నాయని తెలుస్తోంది. బైకులకు ఏసీ యూనిట్ అమరికపై హోండా నుంచి ఇంతవరకూ ఎలాంటి ప్రకటనా వెలువడ లేదు.

  • Loading...

More Telugu News