: 12 రూపాయలు ఇచ్చిన అభిమానిని కలిసిన బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్!
సరిగ్గా ఆరు రోజుల క్రితం 'బీయింగ్ ఇండియా' అనే డిజిటల్ ఛానల్ సోషల్ ఎక్స్‌పెరిమెంట్స్ పేరుతో విడుదల చేసిన ఓ వీడియో గుర్తుందా?...రోడ్ సైడ్ ఉస్తాద్ పేరుతో ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ సుమారు మూడు గంటలపాటు ముంబైలోని రోడ్డుపక్కన బిచ్చగాడి రూపంలో కూర్చుని పాటలు పాడాడు. ఈ సందర్భంగా అంతా సోనూనిగమ్ పాటలు విని వెళ్లిపోతుంటే... ఓ యువకుడు మాత్రం 'అంకుల్ మీ గొంతు చాలా బాగుంది. నేను రికార్డు చేసుకోవచ్చా?' అని అనుమతి అడిగి అతని పాటలు రికార్డ్ చేసుకున్నాడు. అంతటితో ఆగని ఆ వ్యక్తి, 'అంకుల్ నాస్తా కియా?' (అంకుల్...ఏమైనా తిన్నారా?) అని అడిగి, 'ఓ సారి మీకు ధన్యవాదాలు తెలపొచ్చా?' అంటూ షేక్ హ్యాండ్ ఇస్తున్న నెపంతో అక్కడున్న వారెవరూ చూడకుండా 12 రూపాయలు చేతిలో పెట్టాడు. దీనిని సోనూ నిగమ్ మర్చిపోలేకపోయాడు. సోనూ నిగమ్ గా పాటలు పాడితే లక్షల రూపాయలు వస్తాయి...ఓ అనామకుడిగా పాడితే 12 రూపాయలు వచ్చాయి. ఈ జీవితానికి సంగీతం ఎంతో ఇచ్చింది. వాటన్నికంటే గొప్ప అనుభవాన్ని రోడ్ సైడ్ ఉస్తాద్ ద్వారా సంగీతం నేర్పించిందంటూ... తాను సంపాదించినదంతా ఒకెత్తు, ఈ 12 రూపాయలు ఒకెత్తు అంటూ వాటికి ఫ్రేమ్ కట్టించి, తను సాధించిన మెడల్స్ పక్కన పెట్టాడు. ఈ రోజు ఈ 12 రూపాయలు ఇచ్చిన అభిమానిని సోనూ నిగమ్ కలిశాడు. తన ఇంటికి ఆహ్వానించి, అతనికి ఆతిథ్యమిచ్చాడు. ఈ సందర్భంగా అతని సహృదయతను అభినందిస్తూ, అభిమానికి ధన్యవాదాలు తెలిపాడు.