: రైతు కంట కన్నీరు... టన్ను ఉల్లి అమ్మితే ఒక్క 'రూపాయి' మిగిలింది!
తల్లి కూడా చేయని మేలు ఉల్లి చేస్తుందని చెబుతారు. మేలు సంగతేమో కానీ, కోయకుండానే ఉల్లి రైతులచేత కన్నీరు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టించే రైతు పంటకు గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నాడు. ఉల్లి సాగుకు పెట్టింది పేరైన మరఠ్వాడా ప్రాంతంలో దేవీదాస్ పర్బానే అనే రైతు తన రెండెకరాల పొలంలో ఉల్లి పంటను సాగుచేశాడు. పంటకూడా బాగా వచ్చింది. దీంతో ఉల్లిని తీసుకుని నాసిక్ లోని జిల్లా అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కు తీసుకుని వచ్చాడు. అక్కడ తను తీసుకువచ్చిన టన్ను ఉల్లిపాయలు అమ్మగా అతనికి 1523 రూపాయలు వచ్చాయని చెప్పారు. ఇందులో ఉల్లిని జిల్లా కేంద్రానికి తీసుకురావడానికి అయిన లేబర్ ఛార్జ్ లు, ట్రక్ ఖర్చు 1320 రూపాయలు, ఇతర ఖర్చులు తీసేస్తే తనకు మిగిలింది కేవలం ఒక రూపాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్ లో కేజీ ఉల్లి పాయలు పది రూపాయల కంటే ఎక్కువ ధర పలుకుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో టన్ను ఉల్లికి పది వేల రూపాయలు రావాల్సి ఉండగా, రైతుకు మాత్రం కేజీ కేవలం 65 పైసలు ధర పలకడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.