: ఖాళీ కుండలతో కేజ్రీవాల్ ఇంటి ముందు బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ధర్నాకు దిగారు. నగర వాసులకు నీళ్లు, విద్యుత్ సరఫరా మెరుగ్గా లభించడం లేదని ఆందోళన తెలిపారు. ఓ పక్క ఢిల్లీ వాసులు మంచి నీటి సమస్యను, విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కుంటుంటే మరోపక్క గోవా, పంజాబ్‌లలో అధికారం దక్కించుకోవాలనే తన ఆశను నెరవేర్చుకోవాలని కేజ్రీవాల్ చూస్తున్నారని బీజేపీ నేత సతీష్ ఉపాధ్యాయ్ అన్నారు. లో, హై ఓల్టేజితో విద్యుతు సరఫరా జరుగుతోందని, వీటి వల్ల టీవీలు, ఫ్రిజ్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోతున్నాయని ఆరోపించారు. నీరు, విద్యుత్ అందించకుండా చేస్తోన్న తమ అసమర్థపాలనను కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఖాళీ కుండలతో తమ నిరసనను తెలిపారు.