: తమిళనాట కొత్త తరహా మద్య నిషేధం!
సంపూర్ణ మద్య నిషేధం... దాదాపుగా అసాధ్యమని నిపుణులు ఎప్పుడో తేల్చేశారు. అయినా ముందడుగు వేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. బీహార్ లో మద్య నిషేధం పుణ్యమా అని ఆ రాష్ట్రానికి పొరుగున ఉన్న జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఆబ్కారీ శాఖల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. కేరళలో మొన్నటిదాకా అధికారం చెలాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మద్య నిషేధం దిశగా అడుగులు వేసింది. చేతులు కాల్చుకుంది. ఇక ఇటీవల ఎన్నికలు ముగిసిన తమిళనాడులో వరుసగా రెండో సారి అధికారం చేజిక్కించుకున్న ఆ రాష్ట్ర సీఎం జయలలిత... మద్య నిషేధం దిశగానే అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న సీఎంగా పదవీ ప్రమాణం చేసిన వేదిక మీదే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని 500 వైన్ షాపులను మూసివేస్తూ జయలలిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాల సమయాన్ని కుదిస్తూ కూడా ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 1 నుంచి తమిళనాడులో మధ్యాహ్నం 12 గంటలకు తెరచుకునే మద్యం షాపులు రాత్రి 10 గంటలకు మూత పడాల్సిందే. దీంతో మద్యపానాన్ని గణనీయంగా తగ్గించవచ్చని జయ సర్కారు భావిస్తోంది. నిషేధం విధించకుండా పరిమితులు విధించడమెందుకన్న వారికి జయ సర్కారు నిపుణుల సూచనలనే సమాధానంగా చెబుతోంది. మద్య నిషేధం అమలు దుస్సాధ్యమన్న నిపుణుల సూచనల ఆధారంగానే మద్యపానంపై పరిమితులు విధించుకుంటూ పోతామని జయ ప్రభుత్వం చెబుతోంది. వెరసి దేశంలోనే తమిళనాట కొత్త తరహా మద్య నిషేధం అమల్లోకి వచ్చినట్టైంది.