: 'హిట్ ఇచ్చాడు కదా' అని మరో సినిమా చేసి నష్టపోతున్న మహేష్ బాబు!
టాలీవుడ్ ఇండస్ట్రీ అగ్రనటుల్లో మహేష్ బాబు ముందుంటాడన్నది అందరూ ఒప్పుకునే విషయమే. సెంటిమెంట్ అంశాలు నిండివుండే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక హిట్ రాగానే, ఆ హీరో, దర్శకుల వెంట నిర్మాతలు తిరగడమూ మామూలే. హీరోలు సైతం ఇందుకు మినహాయింపు కాదు. తమకు హిట్టిచ్చిన దర్శకుడితో మరో సినిమాకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు కూడా. మరి కాకతాళీయమో లేక, ఎంచుకునే కథ తప్పోగానీ, తనకు మొదటి సినిమా చేసిన సూపర్ హిట్టిచ్చిన దర్శకులతో ప్రిన్స్ మహేష్ బాబు చేసిన రెండో సినిమాలు బాక్సాఫీసు వద్ద విఫలం అవుతున్నాయి. మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన గుణశేఖర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీను వైట్లలతో పాటు తాజాగా శ్రీకాంత్ అడ్డాల సైతం తన రెండో సినిమాతో ఆకట్టుకోలేకపోయారు. మహేష్ కు స్టార్ డమ్ తెచ్చిన 'ఒక్కడు' తరువాత గుణశేఖర్ చేసిన 'అర్జున్', 'సైనికుడు' సినిమాలు ఫ్లాప్ కాగా, 'అతడు'తో రికార్డులు తిరగరాసిన త్రివిక్రమ్, ఆపై 'ఖలేజా' చేసి సినీ అభిమానులను నిరాశపరిచాడు. ఇక శ్రీను వైట్ల సైతం అదే దారిలో నడుస్తూ, 'దూకుడు' తరువాత 'ఆగడు' వంటి ఫ్లాప్ సినిమా తీయగా, 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు'తో ఫ్యామిలీ ఆడియన్స్ కు మహేష్ ను మరింత దగ్గర చేసిన శ్రీకాంత్ అడ్డాల, తాజాగా 'బ్రహ్మోత్సవం'తో అదే ఫీట్ ను అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇక్కడ ఇంకో విషయం ఉందండోయ్, మహేష్ తో 'పోకిరి' చిత్రం తీసి, 200 సెంటర్లలో 100 రోజులు ఆడిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పూరీ జగన్నాథ్ మాత్రం, తన రెండో చిత్రం 'బిజినెస్ మ్యాన్'తో మంచి బిజినెస్ నే అందుకోవడం గమనార్హం. ఇక తమ హీరోకు హిట్టిచ్చాడు కదా అని, అదే దర్శకుడితో మరో చిత్రం చేస్తే ఫ్లాప్ అవుతున్నామని, ఇకపై రెండో చాన్స్ ఇవ్వొద్దని కృష్ణ కుటుంబ అభిమానులు సలహాలు ఇస్తున్నట్టు సమాచారం.