: తెలుగు మహిళలను అంగడి బొమ్మలుగా అమ్మేస్తున్నారు!: కేంద్రానికి లేఖలో మంత్రి పల్లె ఆవేదన
అరబ్ దేశాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ఏపీ ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆవేదనాభరిత వ్యాఖ్యలు చేశారు. తెలుగు మహిళలను అంగడి బొమ్మలుగా అమ్మేస్తున్నారని ఆయన ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాలకు తరలివెళుతున్న అమాయక తెలుగు మహిళలను ఏజెంట్లు నిలువునా ముంచేస్తున్నారని ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. జీవనోపాధి కోసం అరబ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల మోసాలతో అక్కడే చిక్కుబడిపోయిన తెలుగు మహిళలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు సాయం చేయాలని ఆయన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఓ లేఖ రాశారు. ఏజెంట్ల మోసాలతో పాటు అరబ్ షేకుల దాష్టీకాలకు తెలుగు మహిళలు బలైపోతున్నారని, దిక్కుతోచని స్థితిలో అక్కడే నరకం అనుభవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి తెలుగు మహిళలను రక్షించాలని, వారిని కేంద్రం తన సొంత ఖర్చులతో వారి స్వస్థలాలకు చేర్చేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆ లేఖలో కేంద్రాన్ని కోరారు.