: నరేంద్ర మోదీ వచ్చాక అత్యధికంగా నష్టపోయిన అదానీ, అంబానీలు!


మరో రెండు రోజుల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రజలకు "అచ్చే దిన్" (మంచి రోజులు) తీసుకువస్తామన్న హామీతో గద్దెనెక్కిన మోదీ సర్కారు, ప్రజల విషయంలో ఏమో కానీ, మార్కెట్ వర్గాలకు మాత్రం సంతృప్తిని కలిగించలేకపోయింది. స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం, ఇండియాలోని టాప్ 15 కార్పొరేట్ గ్రూపులు ఈ రెండేళ్లలో సరాసరిన 17 శాతం నష్టపోయాయి. ఈ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 31 లక్షల కోట్లు కాగా, మొత్తం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 96 లక్షల కోట్లతో పోలిస్తే, దాదాపు మూడో వంతు. మోదీ అధికారాన్ని స్వీకరించిన మే 26, 2014న ఈ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 37.44 లక్షల కోట్లుగా ఉండగా, ఆపై తొలి ఏడాది పూర్తయ్యే సరికి ఇది రూ. 36.5 కోట్లకు తగ్గింది. ఇండియాలో లీడింగ్ కార్పొరేట్ గ్రూపులుగా ఉన్న అంబానీలు, అదానీలు, జిందాల్ లు నిర్వహిస్తున్న సంస్థలన్నీ నష్టపోగా, అనిల్ అగర్వాల్, అనిల్ అంబానీల సంపద 51 శాతం మేరకు హరించుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ మార్కెట్ల పతనం కారణంగా ఆదాయం తగ్గడం, కీలకమైన సంస్కరణల అమలులో ఆలస్యం, విదేశీ ఇన్వెస్టర్లు దూరం కావడం వంటి కారణాలతో ప్రముఖ పారిశ్రామికవేత్తల సంస్థలు భారీగా నష్టపోయాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఐటీ, ఫార్మా, కన్స్యూమర్ గూడ్స్ తదితర రంగాల్లోని కంపెనీలు లాభపడగా, సంప్రదాయ భారత ఆర్థిక సామ్రాజ్యాలుగా ఉన్న మెటల్స్, పవర్, ఇన్ ఫ్రా, ఎనర్జీ రంగాల్లోని కంపెనీలు నష్టపోయాయి. ఇక ఈ రెండేళ్లలో వ్యక్తిగత లాభనష్టాలను పరిశీలిస్తే, ముఖేష్ అంబానీ సంస్థల విలువ రూ. 3.56 లక్షల కోట్ల నుంచి రూ. 3.03 లక్షల కోట్లకు తగ్గి 14.97 శాతం దిగజారింది. ఇదే సమయంలో ఓం ప్రకాష్ జిందాల్ కంపెనీల విలువ రూ. 74.23 వేల కోట్ల నుంచి రూ. 51.30 వేల కోట్లకు తగ్గి 31 శాతం దిగజారింది. అదానీ సంస్థల మార్కెట్ కాప్ రూ. 1.17 లక్షల కోట్ల నుంచి రూ. 57.15 వేల కోట్లకు తగ్గి అత్యధికంగా 51.32 శాతం నష్టపోయింది. లాభపడ్డ కంపెనీల్లో పిరామల్ అజయ్ (109 శాతం), షాపూర్జీ పల్లోంజీ (163 శాతం), బిర్లా సీకే (81 శాతం) తదితర కంపెనీలున్నాయి. ఈ పతనం, ఇండియాలో రెండో అతిపెద్ద ధనవంతుడి హోదాను అనుభవించిన గౌతమ్ అదానీని ఇప్పుడు ఐదో స్థానానికి పరిమితం చేసింది. అనిల్ అంబానీ టాప్-20 రిచ్చెస్ట్ పర్సన్స్ జాబితా నుంచి బయటకు వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News