: తాము అధికారంలోకి వచ్చేందుకు 'టెక్' సహకారం అందించిన ప్రశాంత్ కిశోర్ పై మోదీ సర్కారు 'పన్ను' అస్త్రం!
2014లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి కేంద్రంలో అధికారం చేపట్టడానికి సహకరించిన వారిలో టెక్నాలజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఎంతగా ఉపయోగపడ్డాడో అందరికీ తెలిసిందే. ఆపై ఆయన అదే పార్టీ బీహార్ లో ఓడిపోవడానికి కూడా తన వంతు సహకారాన్ని అందించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తుండగా, ఆయనకు ఆదాయపు పన్ను అధికారులు సమన్లు జారీ చేయడం చర్చనీయాంశమైంది. గడచిన నాలుగేళ్లలో ఆయన నిర్వహిస్తున్న అసోసియేషన్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ ఆదాయ వ్యయాల దస్త్రాలను అందించాలని ఆదాయపు పన్ను అధికారులు నోటీసులు జారీ చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ నుంచి ఈ నోటీసులు జారీ అయ్యాయని తెలుస్తోంది. ఈ విషయంలో స్పందించేందుకు సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ సుశీల్ కుమార్ కాలే నిరాకరించారు. ఇదిలావుండగా, అసోసియేషన్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ సంస్థ ప్రశాంత్ కిశోర్ నిర్వహణలో ఉందన్న విషయం బహిరంగ రహస్యమే అయినా, ఆ కంపెనీ చైర్మన్ గా లేదా డైరెక్టర్ గా ప్రశాంత్ పేరు ఎక్కడా లేదని సమాచారం. నాలుగేళ్ల క్రితం భారత్ లోని ప్రముఖ కాలేజీలు, మల్టీ నేషనల్ కంపెనీల నుంచి కొందరు గ్రాడ్యుయేట్లను ఏరి కోరి ప్రశాంత్ తన టీమ్ లో నియమించుకున్నాడు. ఆపై ఐ-ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ)ని ప్రారంభించి సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పార్టీల తరఫున ప్రచారం ప్రారంభించి యువతకు దగ్గరయ్యాడు. ఇదిలావుండగా, సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ సూపరింటెండెంట్ ఎంటీ పేఖలే పేరిట ప్రశాంత్ టీమ్ కు సమన్లు జారీ అయ్యాయని, మే 4వ తేదీతో ఈ నోటీసులను బట్వాడా చేశారని తెలుస్తోంది. గత నాలుగేళ్లకు సంబంధించిన వార్షిక నివేదికలు, బిల్స్, ఇన్ వాయిస్ లు, ఖర్చులు, బ్యాంకు స్టేట్ మెంట్లు, చెల్లింపుల వివరాలు, వాటికి తగినన్ని ఆధారాలను తమకు పంపించాలన్నది ఈ నోటీసుల సారాంశం. మరోవైపు ప్రశాంత్ పై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైతం కన్నేసినట్టు తెలుస్తోంది. అసోసియేషన్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్, ముంబై కేంద్రంగా రిజిస్టర్ కాగా, ముంబైలోని కార్పొరేట్ వ్యవహారాల శాఖ అధికారులు సైతం నోటీసులు పంపేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్, బీజేపీని వదిలి కాంగ్రెస్ కు సహకరించాలని నిర్ణయించుకోవడంతో, ఆయన్ను వేధించాలని చూస్తూ, నోటీసులు పంపారని నెటిజన్ల మధ్య ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. ఈ ఉదంతం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి!