: సీబీఐ ఆఫీస్ లో హరీశ్ రావత్!... ‘స్టింగ్’పై ఉత్తరాఖండ్ సీఎంపై ప్రశ్నల వర్షం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ కొద్దిసేపటి క్రితం సీబీఐ ఆఫీస్ కు వెళ్లారు. ఇటీవల ఉత్తరాఖండ్ లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభంలో న్యాయస్థానాల పుణ్యమా అని హరీశ్ రావత్ తన అధికారాన్ని నిలుపుకున్నారు. అయితే తన పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకున్న బీజేపీకి కౌంటర్ ఇచ్చే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలతో హరీశ్ రావత్ మంతనాలు సాగించారు. బీజేపీ ఎమ్మెల్యేలకు తాయిలాలు ఎర వేస్తూ హరీశ్ రావత్ స్టింగ్ ఆపరేషన్ కు అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ... విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు ఇటీవలే నోటీసులు జారీ చేసింది. దీంతో కొద్దిసేపటి క్రితం తమ ఆఫీస్ కు వచ్చిన హరీశ్ రావత్ ను లోపలికి తీసుకెళ్లిన సీబీఐ అధికారులు.. స్టింగ్ ఆపరేషన్ సీడీ, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన వైనంపై ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం.