: నీట్ వాయిదాకు ప్రణబ్ ఓకే!... ఆర్డినెన్స్ పై సంతకం చేసిన రాష్ట్రపతి
తెలుగు విద్యార్థులను అయోమయంలోకి నెట్టేసిన నీట్ ఈ ఏడాది వాయిదా పడిపోయింది. దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల ప్రవేశం కోసం ఒకే పరీక్ష పేరిట కేంద్రం ప్రతిపాదించిన నీట్ ను ఈ ఏడాది నుంచే అమలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు మెజారిటీ రాష్ట్రాలు నీట్ ను ఈ ఏడాది వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో నీట్ ను ఈ ఏడాది వాయిదా వేస్తూ మొన్నటి కేబినెట్ సమావేశంలో కేంద్రం తీర్మానాన్ని చేసింది. ఈ తీర్మానాన్ని పరిశీలించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ... నిన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దాను పిలిపించుకుని మాట్లాడారు. కేంద్రం వాదన సరైనదేనని భావించిన ప్రణబ్... కొద్దిసేపటి క్రితం నీట్ ను వాయిదా వేస్తూ కేంద్రం ప్రతిపాదించిన ఆర్డినెన్స్ పై సంతకం చేశారు. దీంతో ఈ ఏడాది నీట్ గండం తప్పింది.