: కేఎఫ్సీ, పిజ్జాహట్, డొమినోస్, మెక్ డొనాల్డ్, సబ్ వే, ఎక్కడ బ్రెడ్ తిన్నా క్యాన్సర్ ప్రమాదం... విచారణకు ఆదేశించిన కేంద్రం
ఇండియాలో సేవలందిస్తున్న ఐదు ప్రముఖ మల్టీనేషనల్ ఫాస్ట్ ఫుడ్ చైన్ సంస్థలు సహా ఎన్నో రెస్టారెంట్లలో విక్రయిస్తున్న బ్రెడ్ లో ధైరాయిడ్, క్యాన్సర్ కారక విషపూరిత రసాయనాలు ఉన్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) పరీక్షల్లో తేలడంతో కేంద్ర ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. ఫాస్ట్ ఫుడ్ ఔట్ లెట్ రంగంలో దేశవ్యాప్తంగా విస్తరించిన కేఎఫ్సీ, పిజ్జాహట్, డొమినోస్, సబ్వే, మెక్ డొనాల్డ్, స్లైస్ ఆఫ్ ఇటలీ వంటి అనేక రెస్టారెంట్లు విక్రయిస్తున్న బ్రెడ్ ఉత్పత్తుల్లో అధిక స్థాయిలో రసాయనాలు ఉన్నాయని సీఎస్ఈ వెల్లడించింది. "రోజుకు రెండు స్లైసుల బ్రెడ్ తిన్నా చాలు. వారిలో థైరాయిడ్, క్యాన్సర్ సోకే ప్రమాదం పెరిగిపోతుంది" అని సీఎస్ఈ డిప్యూటీ డైరెక్టర్ చంద్ర భూషణ్ వ్యాఖ్యానించారు. తాము మొత్తం 38 శాంపిల్స్ సేకరించి పరీక్షించగా, పొటాషియం బ్రొమేట్, పొటాషియం లోడేట్ లు ఉన్నట్లు సీఎస్ఈ పేర్కొంది. కాగా, పొటాషియం బ్రొమేట్, పోటాషియం లోడేట్ లను పిండి పదార్థాలతో బ్రెడ్ లు వంటివి తయారు చేసే సమయంలో వాడతారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికల తరువాత చైనా, శ్రీలంక సహా 40 దేశాలు ఈ రసాయనాల వాడకాన్ని నిషేధించాయి. ఇండియాలో మాత్రం వీటిపై నిషేధాన్ని ఇంకా విధించలేదు. సీఎస్ఈ రిపోర్టును చూసిన ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ, "ఈ నివేదికను తీవ్రంగా తీసుకుని వెంటనే పరిశీలించాలని అధికారులను ఆదేశించాను. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాధ్యమైనంత త్వరగా మా నిర్ణయం వెలువడుతుంది" అన్నారు. ఇదే రిపోర్టుపై ఆల్ ఇండియా బ్రెడ్ మ్యాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ వివరణ ఇస్తూ, రసాయనాలను బేకరీ వాడకంలో అనుమతించిన మేరకు మాత్రమే వాడుతున్నామని, అధికంగా వాడటం లేదని స్పష్టం చేసింది. ఇక డొమినోస్ బ్రాండ్ ఔట్ లెట్లను విక్రయిస్తున్న జూబిలంట్ ఫుడ్ వర్క్స్, బ్రిటానియా తదితర సంస్థలు సైతం నివేదికలో వెల్లడించినంతగా రసాయనాలను వాడటం లేదని తెలిపాయి.