: ముద్రగడను కలిశా!... కేసులకు భయపడబోను!: వైసీపీ నేత భూమన ప్రకటన


వైసీపీ కీలక నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నిన్న సంచలన ప్రకటన చేశారు. కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన ‘కాపు గర్జన’లో హింస చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నాటి ఘటనలో రాయలసీమకు చెందిన కొందరు వ్యక్తులు కాపుల్లో చేరి నానా బీభత్సం సృష్టించారని, దీనికంతటికీ భూమన కరుణాకరరెడ్డే కారణమని ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా భూమన సంచలన ప్రకటన చేశారు. తాను ముద్రగడను కలిసిన మాట వాస్తవమేనని భూమన కుండబద్దలు కొట్టారు. అయినా ముద్రగడను కలిసినంత మాత్రాన కేసులు పెడతామంటే భయపడబోనని కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని కలిసింది నిజమే. ఇప్పుడే కాదు... ఎప్పటి నుంచో కలుస్తూనే ఉన్నాను. ఆయనతో 25 ఏళ్లుగా పరిచయం ఉంది. దానిని ఆసరాగా తీసుకుని నాపై కేసులు బనాయించాలనుకుంటే భయపడబోను. నేను ఇలాంటి వాటికి భయపడనన్న విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే నాపై కేసులు పెట్టలేదు’’ అని భూమన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News