: వైజాగ్ మన్యం యాపిల్ కోతకొస్తోంది!


యాపిల్ అంటే కశ్మీర్, సిమ్లా యాపిల్ లే మనకు తెలుసు. ఇకపై విశాఖ మన్యం యాపిల్‌ కూడా మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. భవిష్యత్ లో కశ్మీర్, సిమ్లా యాపిల్ కు దీటైన పోటీని మన మన్యం యాపిల్ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రయోగాత్మకంగా చేపట్టిన యాపిల్‌ సాగు ఫలాలు అందిస్తోంది. పోయినేడాది కోతకొచ్చిన యాపిల్స్ ను మొగ్గ దశలోనే తొలగించిన పరిశోధకులు చెట్టుగా ఎదిగేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. దీంతో ఈ ఏడాది మన్యం యాపిల్ పంట చేతికి వచ్చింది. ఒక్కో చెట్టుకు 10 నుంచి 30 కాయలు కాశాయి. కాయలు ఆకుపచ్చ నుంచి ఎరుపురంగులోకి మారుతున్నాయి. దీంతో తాము ఊహించినట్టే విశాఖ ఏజెన్సీలో యాపిల్‌ సాగు ఆశాజనకంగా ఉందని పరిశోధన స్థానం సహపరిశోధన సంచాలకులు డాక్టర్‌ జి.జోగినాయుడు తెలిపారు. విశాఖ ఏజెన్సీలో చింతపల్లి, లంబసింగి వాతావరణం హిమాచల్‌ప్రదేశ్, కశ్మీర్‌లో ఉన్నట్లే ఉంటుంది. దీంతో పరిశోధకులు 2014 జనవరిలో మైఖేల్‌, అన్న, సెలక్షన్‌ అనే మూడు రకాల యాపిల్‌ మొక్కలను ప్రయోగాత్మకంగా నాటారు. రెండో ఏడాదికే ఇవి కాపుకు వచ్చాయి. అయితే మొక్కలు పూర్తి స్ధాయిలో ఎదగకుండా ఫలాలను తీసుకుంటే భవిష్యత్ లో అవి సరైన ఫలాలను అందించే అవకాశం ఉండదని భావించిన పరిశోధకులు వాటిని తుంచివేశారు (ఫ్రూనింగ్). ఈ సారి అలాంటి ప్రమాదం లేకపోవడం, అంచనాలకు తగ్గట్టు మొక్కలు పెరగడం, ఫలాలు సరైన సైజుకు రావడం వంటి వివరాలు పరిశీలించి, ప్రయోగాత్మకంగా చేపట్టిన యాపిల్‌ సాగు 80 శాతం విజయవంతమైందని ప్రకటించారు. గత డిసెంబర్‌ లో ఫ్రూనింగ్‌ చేసిన 15 మొక్కల్లో ఒక్కొక్క దానికి 10 నుంచి 30 వరకు కాయలు కాశాయి. ప్రస్తుతం యాపిల్‌ కాయలు ఆకు పచ్చరంగు నుంచి ఎరుపు రంగులోకి మారుతున్నాయి. వీటి సైజులో తేడా ఉన్నప్పటికీ రుచి, ప్రొటీన్‌ ల విషయంలో సిమ్లా యాపిల్స్‌ కంటే విశాఖ మన్యం యాపిలే మెరుగ్గా ఉన్నట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు.

  • Loading...

More Telugu News