: దసరా నుంచి తెలంగాణలో కొత్త జిల్లాలు మనుగడలోకి: సీఎం కేసీఆర్


దసరా నుంచి తెలంగాణలో కొత్త జిల్లాలు మనుగడలోకి రావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఎంసీహెచ్ఆర్డీలో కలెక్టర్లతో ఈ రోజు నిర్వహించిన సమావేశం ముగిసింది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై కేసీఆర్ మాట్లాడుతూ, ఈ విషయమై కలెక్టర్లు శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఒక్కో జిల్లాలో నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాలు, సగటున 20 మండలాలు ఉండాలని ఈ సందర్భంగా కేసీఆర్ సూచించారు. పట్టణ ప్రాంతాల మండలాలు కొత్తగా ఏర్పాటు చేయాలని, రెండు నియోజకవర్గాలకు కలిపి ఒక ఆర్డీవో ఉండాలని, అందుకనుగుణంగా కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని, కొత్త జిల్లాలు, మండలాలు, డివిజన్లకు అదనంగా రెవెన్యూ అధికారులను నియమించాలని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై జూన్ 2వ తేదీ తర్వాత హైదరాబాద్ లో వర్క్ షాపు నిర్వహించనున్నామన్నారు. ఆ తర్వాతే జిల్లాల ఏర్పాటుపై తుది కసరత్తు ఉంటుందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై పత్రికల్లో వస్తున్న కథనాలను పరిగణనలోకి తీసుకోవద్దన్నారు. సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోందన్నారు. కృష్ణా పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం కోసం టెండర్లు పిలవాలని కలెక్టర్లను కేసీఆర్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News