: పిజ్జా, బర్గర్లలో కేన్సర్ కారక రసాయనాలు.. పరిశోధకుల హెచ్చరిక
మారుతోన్న జీవనశైలిలో భాగంగా భారత్ లోని నగరవాసులు తమ ఆహారంలో అధికంగా ప్రతీరోజు బ్రెడ్ వంటి పదార్థాలే తీసుకుంటున్నారు. అయితే ఈ అలవాటును మార్చుకోవాల్సిందేనని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని ప్రసిద్ధిగాంచిన ఏడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లనుంచి పిజ్జా, బర్గర్ వంటి పదార్థాలను శాంపిల్స్ గా తీసుకొని తాము చేసిన పరీక్షల్లో కేన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు. తాము సేకరించిన బ్రెడ్, బేకరీ పదార్థాల్లో 84శాతం ఆహారపదార్థాలు పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడెట్ వంటి కేన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. అంతర్జాతీయ కేన్సర్ పరిశోధన సంస్థ ఐఏఆర్సీ కూడా గతంలో పొటాషియం బ్రొమేట్ కేన్సర్ కారకమని తెలిపింది. బ్రెడ్ వంటి పదార్థాల్లో ఇవి అధికంగా ఉంటున్నాయని సీఎస్ఈ చెబుతోంది.