: రణబీర్ కపూర్ తో నాకు ఎటువంటి సంబంధం లేదు: మేకప్ ఆర్టిస్ట్ భారతీ మల్హోత్రా
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తో ఢిల్లీకి చెందిన మేకప్ ఆర్టిస్ట్ భారతీ మల్హోత్రాకు సంబంధాలు ఉన్నాయంటూ మీడియాలో వదంతులు గుప్పుమన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీ మల్హోత్రా నోరు విప్పింది. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, రణబీర్ తో తాను డేటింగ్ చేశానన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని, అసలు రణబీర్ కు, తనకు ఎటువంటి సంబంధమూ లేదని చెప్పింది. రణబీర్ కపూర్ తో డేటింగ్ చేశావా? అంటూ గతవారం తన ఫ్రెండ్ నుంచి తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని... దీంతో, వదంతులు వ్యాపించాయన్న విషయం తనకు అర్థమైందని చెప్పింది. అంతేకాకుండా, ఒక న్యూస్ ఛానెల్ లో, ఫేస్ బుక్ లో వదంతి వార్తలు వచ్చాయని చెప్పింది. ఈ వార్తలను ఆపాలని కొన్ని సంస్థలకు తాను ఫోన్ చేసి చెప్పానని, కొంతమంది స్పందించారని, మరికొంతమంది పట్టించుకోలేదని చెప్పింది. అసలు, ఇటువంటి వార్తలు ఎవరు పుట్టిస్తున్నారో తెలియడం లేదని, ఆ వార్తలను ఏ విధంగా నిరోధించాలో కూడా తనకు తెలియదని భారతీ మల్హోత్రా పేర్కొంది.