: తొలిరోజే ఇంత అవమానమా? జయలలిత మారలేదు, మారబోదు: అమ్మ వైఖరిపై కరుణానిధి నిప్పులు
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జయలలితపై గౌరవంతో, తమ పార్టీ తరఫున స్టాలిన్ ను ప్రతినిధిగా పంపితే, ఘోరంగా అవమానించి పంపారని జయలలితపై డీఎంకే అధినేత కరుణానిధి నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తన పార్టీ ప్రతినిధిని వెనుక సీట్లలో కూర్చోబెట్టారని, ఆమె వైఖరి గర్హనీయమని 93 ఏళ్ల కరుణానిధి విమర్శించారు. తన కుమారుడికి సరైన గౌరవం ఇవ్వలేదని చెప్పారు. "జయలలిత మారలేదు. ఆమె ఎప్పటికీ మారరని మరోసారి నిరూపితమైంది. ఎన్నికల్లో ఓటమిపాలైన నటుడు శరత్ కుమార్ కు ముందు వరుసలో సీటేశారు. 89 సీట్లు గెలిచిన స్టాలిన్ ను వెనకాల కూర్చోబెట్టారు. ఇదేనా తోటి అసెంబ్లీ సభ్యులకు ఆమె ఇచ్చే గౌరవం?" అని ప్రశ్నించారు. కాగా, ఈ ఉదయం పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి స్టాలిన్ రాగా, వెనుకవైపున్న సీట్లలో ఆయనకు సీటు కేటాయించారు. దీనిపై తమిళనాడులో డీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.