: దీనిని పదవిగా కాకుండా సేవగా భావిస్తా: కిరణ్ బేడీ
పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ గా నియమించడంపై ఐపీఎస్ మాజీ అధికారిణి కిరణ్ బేడీ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, ఇదో అద్భుతమైన అవకాశమని అన్నారు. ప్రజల బాధలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించడమే తన ముందున్న లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వానికి పనిచేయడం త్యాగంతో కూడిన సేవని, ఆ సేవ చేయడం తనకు ఇష్టమని, అందులోనే ఆనందం లభిస్తుందని ఆమె చెప్పారు. అలా సేవ చేసే బాధ్యతను అప్పగించడం సంతోషం కలిగించిందని ఆమె తెలిపారు. దీనిని పదవిగా కాకుండా సేవగా భావిస్తానని ఆమె స్పష్టం చేశారు. తనపై నమ్మకముంచిన కేంద్రానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. నీతి నిజాయతీలు కలిగిన ఐపీఎస్ అధికారిగా నీరాజనాలు అందుకున్న కిరణ్ బేడీని కాంగ్రెస్ అధికారం చేపట్టనున్న రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమిస్తూ కేంద్రం సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.