: ఏపీజే అబ్దుల్ కలాం వెల్ఫేర్ సొసైటీ పేరిట విద్యార్థులకు కుచ్చుటోపీ!


ఏపీజే అబ్దుల్ కలాం పేరిట నెలకొల్పిన ఒక వెల్ఫేర్ సొసైటీ టాలెంట్ టెస్ట్ పేరిట విద్యార్థులకు కుచ్చుటోపీ పెట్టింది. ఈ సంఘటన హైదరాబాద్, మెహిదీపట్నంలో జరిగింది. నాలుగో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈ టాలెంట్ టెస్టు నిర్వహిస్తామని, ప్రతిభ చూపిన విద్యార్థులకు ‘బ్రైట్ స్టూడెంట్’ అవార్డు కింద నగదు బహుమతి ఇస్తామని సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. టాలెంట్ టెస్టు గురించి ఆన్ లైన్ లో ప్రచారం చేశారు. పరీక్ష నిర్వహణ ఫీజు కింద వెయ్యి మంది విద్యార్థులు ఒక్కొక్కరూ రూ.200 చొప్పున చెల్లించారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందని... పరీక్షా కేంద్రంగా మెహిదీపట్నంలోని నారాయణమ్మ ఉన్నత పాఠశాలను నిర్ణయించామని పేర్కొన్నారు. నిర్దేశిత సమయం కన్నా ముందుగానే పరీక్షా కేంద్రం వద్దకు విద్యార్థులు చేరుకున్నారు. ఎంతసేపటికి, కలాం వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు రాకపోవడంతో, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఉమా కుమారిని ఈ విషయమై ప్రశ్నించగా, నిర్వాహకుల గురించి తమకు తెలియదని, తమ పాఠశాలలో పరీక్ష నిర్వహించుకుంటామంటే సరేనన్నామని ఆమె చెప్పారు. నాలుగు రోజుల క్రితం వరకు తమతో కలాం వెల్పేర్ సొసైటీ నిర్వాహకులు మాట్లాడారని, ఆ తర్వాత తమకు ఫోన్ చేయలేదని ఆమె చెప్పడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. కలాం వెల్ఫేర్ సొసైటీ పేరిట సదరు సంస్థ తమను మోసం చేసిందని నిర్ధారించుకున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News