: తొలిసారి హిల్లరీ క్లింటన్ ను వెనక్కి నెట్టేసిన డొనాల్డ్ ట్రంప్
నిన్నమొన్నటి వరకూ డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ లు అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీపడిన పక్షంలో హిల్లరీకి మద్దతు పలుకుతామని చెబుతూ వచ్చిన రిజిస్టర్డ్ ఓటర్లు, నెమ్మదిగా మనసు మార్చుకుంటున్నారు. యూఎస్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత, తొలిసారిగా ఎగ్జిట్ పోల్స్ లో హిల్లరీని ట్రంప్ అధిగమించారు. 69 ఏళ్ల నిర్మాణ రంగ దిగ్గజం ట్రంప్ ప్రస్తుతం క్లింటన్ కన్నా 0.2 శాతం లీడింగ్ లో ఉన్నారు. ఎన్నికల్లో రిజిస్టర్ చేయించుకున్న ఓటర్లలో 43.4 శాతం మంది ట్రంప్ కు మద్దతు పలుకుతుండగా, 43.2 శాతం మంది క్లింటన్ వైపున ఉన్నారని 'రియల్ క్లియర్ పాలిటిక్స్ డాట్ కాం' వెల్లడించింది. కొన్నివారాల క్రితం వరకూ ట్రంప్ తో పోలిస్తే, క్లింటన్ రెండంకెల లీడ్ లో ఉండగా, ట్రంప్ ఆపై నిదానంగా ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకుంటూ, దూసుకు వస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన తన పరపతిని స్పష్టంగా పెంచుకుంటున్నారని ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్ ప్రకటించాయి. క్లింటన్ తో పోలిస్తే 2 శాతం అధిక అమెరికన్ల మద్దతును ఆయన పొందుతున్నారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.