: పన్నెండేళ్లకే గ్రాడ్యుయేట్ అయి, రెండు అమెరికన్ యూనివర్శిటీల్లో ప్రవేశం పొందిన భారత సంతతి బాలుడు


తనిష్క్ అబ్రహాం... కాలిఫోర్నియాలోని స్కారామెంటో పట్టణంలో నివసించే భారత సంతతి బాలుడు. తన అద్భుత మేధస్సుతో 12 ఏళ్లకే మ్యాథ్స్, సైన్స్, ఫారిన్ లాంగ్వేజ్ విభాగాల్లో అసోసియేట్ డిగ్రీలతో పాటు అమెరికన్ రివర్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ పట్టాను పొంది, అధ్యక్షుడు బరాక్ ఒబామా చేత ప్రశంసలు పొందిన బాలుడు. ఇక తనిష్క్ తదుపరి లక్ష్యం, 18 సంవత్సరాలకే మెడికల్ డిగ్రీ పొంది, అతి చిన్న వైద్యుడిగా అవతరించడం. తనిష్క్ కు మెడికల్ డిగ్రీ ప్రవేశాన్ని కల్పించేందుకు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూసీ శాంతా క్రజ్ వర్శిటీలు ముందుకు వచ్చాయి. స్కాలర్ షిప్ ఇచ్చేందుకూ ఓకే చెప్పాయి. ఇప్పుడు ఏ వర్శిటీలో చేరాలన్న విషయమై తనిష్క్ నిర్ణయం తీసుకోవాల్సి వుంది. కాగా, భవిష్యత్తులో అమెరికాకు అధ్యక్షుడిగా కావాలని ఉందని చెబుతున్న తనిష్క్, అమెరికాలో హైస్కూల్ గ్రాడ్యుయేషన్ పొందిన అతిచిన్న వయస్కుడిగా ఇప్పటికే రికార్డు సృష్టించాడు. తన నాలుగేళ్ల వయసులోనే ఐక్యూ సొసైటీ మెన్సాలో సభ్యుడిగా చేరాడు. కళాశాలలో కొందరు విద్యార్థులు తనను ఏడిపించినా, చాలా మంది ప్రోత్సహించారని చెబుతున్న తనిష్క్ అబ్రహం, తను మరో ఆరేళ్లలో ఆపరేషన్లు చేసే వైద్యుడిని అవుతానని నమ్మకంగా చెబుతున్నాడు. ఆల్ ది బెస్ట్ తనిష్క్!

  • Loading...

More Telugu News