: మాయావతితో రాతియుగమే... ప్రియాంక వస్తే కాంగ్రెస్ కు బాగుంటుంది: అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రియాంకా గాంధీని ముందు ఉంచి నడిస్తే, మెరుగైన ఫలితాలు రావచ్చని సీఎం అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. వచ్చే సంవత్సరం జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి విజయం సాధిస్తే, రాష్ట్రం తిరిగి రాతియుగంలోకి వెళ్లినట్టేనని అభిప్రాయపడ్డ ఆయన, ఆ పార్టీని ఎన్నుకోవద్దని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీకి బాధ్యతలు అప్పగిస్తేనే ఆయనలోని సత్తా తెలుస్తుందని వివరించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన ఆయన, బీజేపీకి కలిగిన లాభం స్వల్పమేనని అన్నారు. 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకన్నా ముందు జరిగే అతిముఖ్యమైన యూపీ, పంజాబ్ తదితర రాష్ట్రాల ఫలితాలను చూసే వరకూ బీజేపీ సైతం పొంగిపోరాదని అన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో చతుర్ముఖ పోరు జరగనుందని వివరించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ రహిత భారతావనిని నిజం చేయాల్సి వుందని వివరించారు. బీజేపీని అధికారం నుంచి తొలగించే సత్తా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి వుంటుందని తాను భావించడం లేదన్నారు. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించడాన్ని తప్పుపడుతూ, రాజకీయాలను సైతం కాంగ్రెస్ ఔట్ సోర్సింగ్ చేస్తోందని విమర్శించారు.