: పోలీసుల లాఠీచార్జ్, అరెస్టులు... బెజవాడలో తీవ్ర ఉద్రిక్తత
ఈ ఉదయం విజయవాడలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అలంకార్ సెంటర్ లో ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ నేతలు, ఆపై ప్రకాశం బ్యారేజీని ముట్టడించాలని బయలుదేరగా, వారిని ఏలూరు రోడ్డులో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, పోలీసు అధికారుల మధ్య వాగ్వాదం జరుగగా, కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పలు చోట్ల బారికేడ్లను అడ్డుపెట్టినప్పటికీ, కాంగ్రెస్ నేతలు వాటిని దాటుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. బ్యారేజీకి సమీపంలోకి వచ్చిన తరువాత ఓ దశలో పోలీసులపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని నలువైపులా చెదరగొట్టి, కేవీపీ, రఘువీరా రెడ్డి, కిల్లి కృపారాణి, దేవినేని నెహ్రూ తదితరులను అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించారు. తాము ప్రజల కోసం పాటుపడుతుంటే, అరెస్ట్ లు చేయడం దుర్మార్గమని ఈ సందర్భంగా రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. తదుపరి తాము మరింత పెద్దఎత్తున ఉద్యమించనున్నామని స్పష్టం చేశారు.