: 'ఉచితం' పుణ్యమాని ఫ్యాన్లు, టీవీలు, గ్రైండర్లు చేరాయి... 70 ఏళ్లుగా కరెంటు మాత్రం ఇవ్వలేకపోయారు.. తమిళనాడులోని ఓ గ్రామం పరిస్థితి!
అది తమిళనాడులోని ప్రధాన నగరాల్లో ఒకటైన కోయంబత్తూరుకు పశ్చిమాన 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఇరుల వర్గానికి చెందిన దాదాపు 155 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, ఉచిత హామీల పుణ్యమాని ప్రతి ఇంట్లో టీవీలు, ఫ్యాన్లు, టేబుల్ టాప్ గ్రైండర్లు, జ్యూస్ బ్లెండర్లు వంటి ఎన్నో గృహోపకరణాలు చేరిపోయాయి. కానీ వాటిని వాడుకుందామంటే మాత్రం కరెంటు లేని పరిస్థితి. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా, ఇంతవరకూ ఆ గ్రామానికి కరెంటు సరఫరా లేదు. వీరంతా కోయంబత్తూర్ సమీపంలోని అన్నైకట్టి అటవీ ప్రాంతంలోని భూముల్లో మొక్కజొన్న తదితర ధాన్యాలను పండించుకుంటూ బతుకుతుంటారు. కొందరు రోజువారీ కూలీకి కోయంబత్తూరుకు వచ్చి సాయంత్రానికి ఇల్లు చేరుతున్న వారూ ఉన్నారు. "మాకు కరెంటు సరఫరా చేయాలని డీఎంకే, ఏఐఏడీఎంకే ప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నామో మాకే తెలియదు. మాకు ఫ్యాన్లు, టీవీల వంటివి ఎన్నో వచ్చాయి. అందరి ఇళ్లల్లో ఇవి మూలన పడివున్నాయి. కరెంటు లేనిదే వీటన్నింటినీ ఏం చేసుకోవాలి?" అని కె రంగమ్మ అనే మహిళ వాపోయింది. రాత్రిపూట తాము కిరోసిన్ దీపాలతోనే కాలం నెట్టుకొస్తున్నామని, పిల్లల చదువులకు ఎంతో ఇబ్బందులు వున్నాయని ఆమె వివరించారు. తమ ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సలీమ్ అలీ ఆర్నిథాలజీ సెంటర్ వరకూ విద్యుత్ సరఫరా ఉందని, ఈ కొద్ది దూరం మాత్రం కరెంటు స్తంభాలను వేయడం లేదని ఆరోపించారు. కోయంబత్తూర్ లోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో, కొన్ని సౌర విద్యుత్ దీపాలు మాత్రం అమర్చారని రామరాజ్ అనే రైతు తెలిపాడు. కాగా, తాము విద్యుత్ ఇవ్వాలని భావించినా, అటవీ ప్రాంత అధికారుల నుంచి అనుమతులు రావడం లేదని కవుదంపాలయం ఎమ్మెల్యే, ఏఐఏడీఎంకే నేత వీసీ అరుకుట్టి వివరించారు. భూగర్భ కేబుల్స్ వేసే ప్రతిపాదన ఉందని తెలిపారు.